న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి కానుకగా డీఏను 3 శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. డీఏ పెంపునకు సంబంధించి ఎప్పుడైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని పేర్కొంది.
ఈరోజు ఉదయం ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు డీఏ పెంపుకు ఆమోదం తెలిపారు. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ నిర్ణయంతో కోటికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం సాధారణంగా ప్రతి సంవత్సరం రెండుసార్లు ఉద్యోగుల డీఏను పెంచుతుంది.
పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను అందిస్తారు. ఈ ఏడాది మార్చిలో కూడా ఉద్యోగుల డీఏను, పెన్షనర్ల డీఆర్‌ను కేంద్రం 4 శాతం పెంచింది. పెంపుపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత… ఇప్పటి వరకు ఉన్న 50 శాతం డీఏ 53 శాతానికి చేరుకుంటుంది.