హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రైవేట్ ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. రాష్ట్రంలోని దివ్యాంగులకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలోనే శుభవార్త చెప్పనుంది. వారికి వీలైనంత త్వరగా ప్రైవేటు ఉద్యోగాల కోసం ఆయా సంస్థల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా జాబ్‌పోర్టల్‌ను అందుబాటులో తెచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు సచివాలయంలో దివ్యాంగుల సంక్షేమశాఖలో కలిసి జాబ్‌పోర్టల్ https://pwdjobportal.telangana.gov.in ను మంత్రి ఆవిష్కరించారు.
దీంతో పాటుగా మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టరేట్ కాల్ సెంటర్‌లో 10 మంది దివ్యాంగులకు నియామకపత్రాలు అందజేశారు. త్వరలోనే దివ్యాంగులకు ఇందిరమ్మ గృహాలు, ఇతర సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల్లో 5 శాతం నిధులు వారి కోసం ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ఆలోచిస్తూ వారికి అందించే ఉపకరణాల కోసం రూ.50 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. త్వరలోనే దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి సీతక్క. స్వయం ఉపాధి పథకాలకు చేయూత అందిస్తామన్నారు.