ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియపై స్పష్టత వచ్చింది. బీసీసీఐ ప్రతి జట్టుకు ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రతి ఫ్రాంచైజీ రిటైన్ చేయనున్న ఆటగాళ్ల జాబితా సిద్ధం చేసే పనిలో ఉంది. ఈ సీజన్‌లో మెగా వేలం సమీపిస్తున్నందున, కొత్త ఆటగాళ్లను ఎలా తీసుకోవాలనే విషయంపై కూడా ఫ్రాంచైజీలు చర్చలు ప్రారంభించాయి.
ముఖ్యంగా, ముంబయి ఇండియన్స్‌కు సంబంధించిన ఒక పెద్ద వార్త ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఈ సారి ఫ్రాంచైజీ వదులుకుంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత సీజన్‌లో, రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుండి తొలగించి, గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా వచ్చిన హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామాలతో రోహిత్ ఫ్రాంచైజీతో కొనసాగడానికి ఆసక్తి చూపడం లేదని సమాచారం.
ఈ క్రమంలో, రోహిత్ వేలంలోకి వస్తే ఆయనకు భారీ డిమాండ్ ఉండటం ఖాయం. పలు ఫ్రాంచైజీలు, ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), రోహిత్‌ను తమ జట్టులో చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం మీద చర్చించడానికి టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అభిమానులతో చేసిన ముచ్చట ప్రత్యేకంగా నిలిచింది.
అశ్విన్ యూట్యూబ్ ఛానెల్‌లో అభిమానులతో చర్చిస్తూ, రోహిత్ శర్మ వేలంలోకి వస్తే, ఆర్‌సీబీ లాంటి జట్లు కనీసం రూ. 20 కోట్లు పక్కన పెట్టుకోవాలని పేర్కొన్నాడు. “అగర్ రోహిత్ శర్మ కే లియే ఆప్ జా రహే హైతో బిస్ క్రోర్ రఖ్నా పడేగా” (మీరు రోహిత్ శర్మను కొనుగోలు చేయాలనుకుంటే రూ. 20 కోట్లు సిద్ధంగా ఉంచుకోవాలి) అని అశ్విన్ తన కామెంట్‌లో పేర్కొన్నాడు.
ఇది చూసిన అభిమానుల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒకే జట్టులో ఉంటే ఎలా ఉంటుందనే ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ఇదే జరిగితే, ఐపీఎల్‌లో మరో అద్భుత కాంబినేషన్ చూడాలనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో పెరుగుతోంది.