న్యూఢిల్లీ: జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగనుంది. భారత ఎన్నికల కమిషన్ ఈ రోజు (మంగళవారం) మధ్యాహ్నం 3:30 నిముషాలకు ప్రత్యేక మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించనుంది.
దీనికి సంబంధించిన ఈసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ మీడియా సమావేశం జరగనుంది. కాగా.. అనధికారిక సమాచారం ప్రకారం ఈ రెండు రాష్ట్రాలకు నవంబర్‌లో ఓటింగ్ జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే దీపావలితో పాటు ఝార్ఖండ్‌లో ప్రధాన పండగైన ఛఠ్ పూజ, దేవి దీపావళి పండుగలు కూడా వరుసగా ఉండడంతో ఇవి ముగిసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే నవంబర్ రెండో వారంలో లేదా మూడో వారంలో ఓటింగ్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా మరో 45 ఎమ్మెల్యే, ఎంపీ నియోజకవర్గాలకు కూడా మధ్యంతర ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటికి కూడా ఈ సమావేశంలోనే నోటిఫికేషన్ విడుదల చేసే ఆలోచనలో ఈసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నియోజకవర్గా్ల్లో రాహుల్ గాంధీ రాజీనామా చేసిన వాయనాడ్ పార్లమెంట్ స్థానంతో పాటు బెంగాల్ టీఎంసీ నేత షేక్ నూరుల్ ఇస్లామ్ మరణంతో ఖాళీ అయిన బషీర్‌హాట్ ఎంపీ స్థానాలున్నాయి.