కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. ఈ పుణ్య క్షేత్రంలో అక్టోబర్ 4 నుంచి ప్రారంభమైన ఈ పవిత్ర ఉత్సవాలు, నేటి విజయదశమి రోజున చక్రస్నానం ఘట్టంతో సమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో జె. శ్యామలరావు మీడియాతో మాట్లాడారు.
తిరుమల వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించామని ఆయన తెలిపారు. భక్తుల సౌకర్యం కోసం అన్నీ చర్యలు ముందుగానే తీసుకున్నామని, భగవంతుడికి సేవ చేయడమే భక్తులకు సేవ చేయడమేనని ఈవో స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పర్యవేక్షణలో నిమగ్నమయ్యామని తెలిపారు.
బ్రహ్మోత్సవాల నిర్వహణలో టీటీడీ సిబ్బంది, విజిలెన్స్ అధికారులు, పోలీసు సిబ్బంది, మరియు జిల్లా యంత్రాంగం కలిసి సమన్వయంతో పనిచేశారని ఈవో చెప్పారు. తిరుమలలో వాహనాల రద్దీని నియంత్రించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ అద్భుతంగా సాగిందని, 26 లక్షల మందికి అన్నప్రసాదాలు అందించామని వివరించారు. అదేవిధంగా భక్తులకు పాలు, బాదం పాలు, మజ్జిగ, కాఫీ వంటి పానీయాలు కూడా అందించామన్నారు. అదనంగా, 4 లక్షల వాటర్ బాటిళ్లు కూడా భక్తులకు అందించామని తెలిపారు.
అత్యంత ముఖ్యమైన గరుడ వాహన సేవ రోజున, దాదాపు 3.5 లక్షల మంది భక్తులు పాల్గొన్నారని, వారికి ఎలాంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం సాధ్యమైందని ఈవో శ్యామలరావు హర్షం వ్యక్తం చేశారు.
బ్రహ్మోత్సవాల మొత్తం వ్యవధిలో భక్తులందరికీ తిరుమల దేవస్థానం టీమ్ అద్భుతమైన సేవలు అందించిందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి పునీత కార్యక్రమాలను మరింత మెరుగైన విధంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని జె. శ్యామలరావు పేర్కొన్నారు.