ఛండీగఢ్: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు 9.53 శాతం ఓటింగ్ నమోదయింది.
కాగా, రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాల్లో 1031మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వారిలో 101 మంది మహిళలు ఉన్నారు. 2 కోట్లకుపైగా ఓటర్లు ఉండగా వారికోసం 20,629 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. ఈనెల 8న ఫలితాలు వెలువడనున్నాయి.
వినేశ్ ఫోగట్, షూటర్ మనూ బాకర్ సహా పలువురు ప్రములు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఒలింపిక్ మెడల్ విన్నర్ మను బాకర్ ఝజ్జర్ పోలింగ్ కేంద్రంలో తొలిసారిగా ఓటువేశారు. అంబాలాలో సీఎం నాయబ్ సింగ్ సైనీ, కర్నాల్‌లో మాజీ సీఎం, కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, ఫరీదాబాద్‌లో కేంద్రమంత్రి క్రిషన్ పాల్ గుర్జర్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చాక్రిదాద్రి పోలింగ్ కేంద్రంలో ఓటేసిన మాజీ రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫొగాట్ ఓటేశారు. పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.