టీడీపీలో చేరుతున్న తీగ‌ల కృష్ణారెడ్డి

Teegala Krishna Reddy joining TDP

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో వివిధ పార్టీలకు చెందిన నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే దాదాపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్లు, మేయర్లు, పలువురు మాజీ ఎమ్మె్ల్యేలు, కీలక నేతలు సైతం వివిధ పార్టీలకు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అటువంటి తరుణంలో ఓ మాజీ ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యాడు.

తాను తెలంగాణ టీడీపీలో చేరబోతున్నట్లు మాజీ ఎమ్మెల్యే తీగ కృష్ణా రెడ్డి ప్రకటించారు. నేడు హైదరాబాద్‌లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన ఆయన భేటీ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించారు. తెలంగాణలో టీడీపీ పూర్వ వైభవం కోసమే ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిశామని చెప్పారు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ నివాసంలో చంద్రబాబుతో తీగల భేటీ అయ్యారు.

కాగా, మల్లారెడ్డి మనుమరాలు, రాజశేఖర్ రెడ్డి కూతురు శ్రేయరెడ్డి పెళ్లికి రావాలని చంద్రబాబును వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం, దివంగత ఎన్టీఆర్‌తోనే తమ రాజకీయ ప్రస్థానం మొదలైందని తీగల గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది చంద్రబాబేనని అన్నారు. తెలంగాణలో టీడీపీ పాలన మళ్లీ రావాల్సిన అవసరం ఉందని అన్నారు. త్వరలోనే తాను పసుపు కండువా కప్పుకోనున్నట్లు చెప్పారు.

తీగ‌ల కృష్ణారెడ్డి గతంలో హుడా ఛైర్మన్‌గా, ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ నగర మేయర్‌గా, ఎమ్మెల్యేగా పని చేశారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి బీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తీగ‌ల కృష్ణారెడ్డి కోడ‌లు, రంగారెడ్డి జ‌డ్పీ ఛైర్‌పర్సన్ తీగ‌ల అనితారెడ్డితో కలిసి బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి సొంత గూడు టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *