డిసెంబర్ 23న బీఎస్‌ఇ సెన్సెక్స్‌లో జొమాటో ప్రవేశించిన కొన్ని వారాల తర్వాత, 17వ వార్షికోత్సవంలో పేరును మార్చింది. జొమాటో బోర్డు కంపెనీ పేరును “ఎటర్నల్ లిమిటెడ్”గా మార్చేందుకు ఆమోదం తెలిపింది. అయితే, ఫుడ్ డెలివరీ బ్రాండ్ పేరు మాత్రం జొమాటోగానే కొనసాగుతుంది. కంపెనీ CEO దీపిందర్ గోయల్ ఈ పేరు మార్పు వెనుక ఒక విశిష్టమైన దృష్టికోణం ఉందని పేర్కొన్నారు. ఇది కేవలం పేరు మార్పు మాత్రమే కాకుండా, ఒక మిషన్ స్టేట్‌మెంట్ అని చెప్పారు. “మేము బ్లింకిట్‌ను కొనుగోలు చేసినప్పుడు, భవిష్యత్తులో ఒక కొత్త దిశలో వెళ్లాలని భావించాం. ఫుడ్ డెలివరీకి మించి విస్తరించేందుకు ఎటర్నల్ అనే పేరు సరైనదని భావించాం. ఇప్పుడు, ఆ దశకు మేము చేరుకున్నామని నాకు అనిపిస్తోంది” అని గోయల్ వివరించారు.

ఎటర్నల్ లిమిటెడ్ నాలుగు వ్యాపార యూనిట్లను కలిగి ఉంటుంది, జొమాటో – ఫుడ్ డెలివరీ సేవలు, బ్లింకిట్ – కిరాణా, తక్షణ డెలివరీ సేవలు, డిస్ట్రిక్ట్ – రెస్టారెంట్ సపోర్ట్ సేవలు, హైపర్‌ప్యూర్ – రెస్టారెంట్లకు అవసరమైన సరఫరా సేవలు. జొమాటో, భారతదేశంలో సెన్సెక్స్‌లో చోటు దక్కిన తొలి టెక్ స్టార్టప్ కావడం గర్వకారణమని గోయల్ అభిప్రాయపడ్డారు. ఇది కంపెనీ భవిష్యత్తుకు మరింత బాధ్యతను తీసుకొచ్చే మార్గంగా ఉంటుందని చెప్పారు. ఈ కొత్త పేరు శాశ్వత అభివృద్ధి, దీర్ఘకాలిక మిషన్‌ను సూచిస్తుందని గోయల్ చెప్పారు. ఈ పేరు మార్పుతో, జొమాటో తన వ్యాపార పరిధిని విస్తరించేందుకు మరింత దృష్టి పెడుతోంది. ఇది కంపెనీ భవిష్యత్తుకు కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పొచ్చు.