బోణీ కొట్టలేక పోయిన భారత యువ జట్టు

వరల్డ్ కప్ గెలిచినా ఆనందంలో ఉన్న క్రికెట్ అభిమానులకు యువ క్రికెట్ జట్టు షాక్ ఇచ్చింది. జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో భాగంగా ఈరోజు హరారేలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వే 13 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. సొంతగ‌డ్డ‌పై తెండాయ్ చ‌త‌ర‌(3/16), కెప్టెన్ సికింద‌ర్ ర‌జా (3/25), లు విజృంభించ‌డంతో శుభ్‌మ‌న్ గిల్ సేన 102కే ఆలౌట‌య్యింది. దాంతో, భార‌త జ‌ట్టుపై టీ20ల్లో అత్య‌ల్ప స్కోర్‌ను కాపాడుకున్న జ‌ట్టుగా జింబాబ్వే చ‌రిత్ర సృష్టించింది. ఇంత‌క‌ముందు ఆ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉంది. కివీస్ 2016లో టీమిండియాపై 126 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కాపాడుకుంది.

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులు చేసింది. ఇక 116 పరుగుల స్వ‌ల్ప టార్గెట్ తో చేజింగ్ కు దిగిన టీమిండియా 102 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ శుభ్ మాన్ గిల్ 31 టాప్ స్కోర‌ర్‌‌గా నిలిచాడు. ఆఖర్లో అవేష్ ఖాన్ (16), వాషింగ్టన్ సుందర్ (27) పరుగులు చేసి అవుట్ అయ్యారు. జింబాబ్వే బౌలర్లలో తెందాయ్ చతారా 3, కెప్టెన్ సికిందర్ రజా 3 వికెట్లు తీసి రాణించారు. ఇక బ్రయాన్ బెన్నెట్ 1, వెల్లింగ్టన్ మసకద్జా 1, బ్లెస్సింగ్ ముజరబాని 1, ల్యూక్ జోంగ్వే 1 వికెట్ తీశారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో జింబాబ్వే 1-0తో ముందంజ వేసింది.