నేడే హైదరాబాద్‌లో జీరో షాడో డే..

హైదరాబాద్ లో నేడు అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 12 నిమిషాల నుంచి 12 గంటల 14 నిమిషాల మధ్యలో నీడ మాయం కానుంది. సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల ఇలా నీడ కనిపించదని సైంటిస్టులు చెపుతున్నారు. ఇటీవలే బెంగళూరులో ఈ అరుదైన ఘటన చోటుచేసుకోగా.. ఈరోజు హైదరాబాద్ లో కూడా నీడ పడని రోజు రానుంది.

సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు నగరంలో నీడ మాయం కానుంది. అంటే మన నీడ కనిపించదు. ఇలా జరగడాన్ని ‘జీరో షాడో డే’ అంటారు. నగరంలో సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడతాయి. అప్పుడు ఎండలో నిటారుగా ఉంచిన వస్తువుల నీడ రెండునిమిషాలపాటు అంటే 12 గంటల 12 నిమిషాలనుంచి 12 గంటల 14 నిమిషాల వరకు కనిపించదని బీఎం బిర్లా సైన్స్ సెంటర్ టెక్నికల్ అధికారులు తెలిపారు. ఆ సమయంలో ఎండలో మనం నిల్చున్నా మన నీడ కనిపించదని పేర్కొన్నారు. అలాగే, ఆగస్టు 3న కూడా హైదరాబాద్‌లో ‘జీరో షాడో డే’ ఏర్పడుతుందని తెలిపారు.