ఢిల్లీకి జగన్ బృందం

50 రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిస్థితులను కేంద్రానికి వివరించాలని, ఈ పోరాటానికి క‌లిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకొంటామంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం ఢిల్లీలో నిర్వహించే ధర్నాలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నాయకులంతా పాల్గొనబోతోన్నారు. ఇందుకోసం కొద్దీ సేపటి క్రితం తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్టు చేరుకుని అక్కడి నుంచి విమానంలో హస్తినకు వెళ్లనున్నారు. 3 రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు.

రేపు ఉదయం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనను నిర్వహించనున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్ట్రంలో చోటు చేసుకుంటూ వచ్చిన అన్ని అంశాలనూ ఈ ధర్నా సందర్భంగా ప్రస్తావనకు తీసుకుని రానున్నారు జగన్. హత్యలు, చిన్నపిల్లలపై అత్యాచారాలు, వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులపై దాడులు, వారి ఇళ్లను కూల్చివేయడం వంటి ఘటనపై ఫొటో ఎగ్జిబిషన్ సైతం ఏర్పాటు చేశారు. దీని తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వారి అపాయింట్‌మెంట్ లభించినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న అవాంఛనీయ పరిస్థితులతో కూడిన వినతిపత్రాన్ని అందజేయనున్నారు.