YSR పెన్షన్ కానుక ఎన్టీఆర్ భరోసాగా మార్పు

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబు గురువారం సాయంత్రం పదవి బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ముఖ్యమైన హామీల అమలుకు తొలి సంతకాలు చేసారు. మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం చేసి, నిరుద్యోగుల సమక్షంలోనే 16,347 టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

ఇక ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసే ల్యాండ్ టైటలింగ్ యాక్ట్‌పై రద్దు చేస్తామని ఇచ్చిన హామీ రెండో హామీపై రైతుల సమక్షంలోనే సంతకం చేశారు. సామాజిక పెన్షన్లు రూ.4 వేలకు పెంపు దస్త్రంపైనా లబ్ధిదారులు సమక్షంలో మూడో సంతకం చేశారు. నైపుణ్య గణన దస్త్రంపై నాలుగో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై విద్యార్థుల సమక్షంలో ఐదో సంతకాన్ని చేశారు.

ఇక వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం పేరును తాజాగా టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసాగా మార్చింది. 2014-19 మధ్య పెట్టిన పేరునే కొనసాగించనుంది. ఇకపై వృద్ధులకు రూ.4,000 పెన్షన్ అందనుంది. ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేస్తున్నందున జులై 1న రూ.7,000 ఇస్తుంది. దివ్యాంగులకు రూ.6వేలు అందనుంది. రాష్ట్రంలోని 65.39 లక్షల మంది పింఛన్దారులకు నగదు పెంపుతో నెలకు రూ.2,758 కోట్లు, ఏడాదికి రూ.33,099 కోట్లు ఖర్చవుతుందని అంచనా.