కాసేపట్లో గుంటూరుకు జగన్

మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు గుంటూరు వెళ్లనున్నారు. టీడీపీ ఆఫీస్, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జైల్లో ఉంటున్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ను ఆయన పరామర్శించనున్నారు. బుధవారం ఉదయం 11 గంట‌ల‌కు గుంటూరు సబ్ జైలుకు వెళ్లనున్నారు. మూడు సంవత్సరాల కిందట అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి తీవ్ర పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే. నందిగం సురేష్ సహా కొందరు వైసీపీ నాయకులు టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అప్పట్లో వారిపై కేసులు నమోదయ్యాయి. ముందస్తు బెయిల్ కోసం వాళ్లు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఇటీవలే ఏపీ హైకోర్టు కొట్టివేసింది.

టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు ఇంటి మీద దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, నందిగం సురేష్, దేవినేని అవినాష్ సహా ఇతర నాయకుల పిటిషన్లను తిరస్కరించింది. ముందస్తు బెయిల్ పిటీషన్‌ను హైకోర్టు తిరస్కరించిన వెంటనే నందిగం సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన సెల్‌ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి మరోచోటికి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ పక్కా సమాచారం అందడంతో హైదరాబాద్‌ వెళ్లి ఆయనను అరెస్ట్ చేశారు. గుంటూరు జైలుకు తరలించారు.

ఈ క్రమంలో ఈరోజు సురేష్ ను జగన్ కలవనున్నారు.ఆ తర్వాత ఆయన క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ ఈదా సాంబిరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.