నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో యువజన కాంగ్రెస్ నిరసన

నీట్‌ పరీక్ష నిర్వహణలో లోటుపాట్లు, ప్రశ్నాపత్రాల లీకేజ్‌, నెట్‌-యూజీసీ 2024 పరీక్ష వివాదంపై యూత్ కాంగ్రెస్‌ కార్యకర్తలు గురువారం ఢిల్లీలో నిరసనలు చేపట్టారు. దీనిలో వందలాది మంది పాల్గొని ప్రభుత్వానికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశంలో పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంతో విఫలం అయ్యారని పేర్కొంటూ కేంద్రంపై విమర్శలు చేశారు. విద్యవ్యవస్థ పట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర అశాంతి నెలకొంది, పేపర్‌ లీక్‌ ఘటనతో బాధపడుతున్న విద్యార్థుల గొంతుకగా వేలాది మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీ వీధుల్లోకి వచ్చారని యువజన కాంగ్రెస్‌ చీఫ్‌ బీవీ శ్రీనివాస్‌ అన్నారు. పరీక్షల నిర్వహణలో అక్రమాలు, అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని నేతలు డిమాండ్‌ చేశారు.

ఇదిలా ఉంటే నీట్ ఉదంతంపై ఇతర వర్గాల నుంచి కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ NEET-PG 2024 పరీక్షను వాయిదా వేసింది, కొత్త తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. ప్రభుత్వం NTA చీఫ్‌ని భర్తీ చేసింది, దాని పనితీరును సమీక్షించడానికి, మెరుగుపరచడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అంశానికి సంబంధించిన పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు జులై 8న విచారించనుంది.