Delhi: ఢిల్లీలో కొత్తగా కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం ఈరోజు తన తొలి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రతిపక్ష పార్టీ ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజల డబ్బుతో ఆయన శీష్ మహల్ కట్టారంటూ ఆరోపించారు. ఆప్ ప్రభుత్వం ప్రజల ధనాన్ని దోచుకుంది. సీఎం నివాసం మరమ్మతుల పేరిట కేజ్రీవాల్ రూ. 45 కోట్లు ఖర్చు చేశారు. ఢిల్లీని లండన్‌గా మారుస్తానని ట్రాఫిక్ జామ్‌లకు నిలయంగా మార్చేశారు. వారు చేపట్టిన ప్రాజెక్ట్‌లను అసంపూర్తిగా వదిలేశారు.

మా ప్రభుత్వం వాటిని నేరవేరుస్తుంది
ఆప్, బీజేపీకి మధ్య చాలా తేడాలున్నాయి. మీరు (ఆప్‌ను ఉద్దేశిస్తూ) వాగ్దానాలు చేస్తారు. కానీ, మా ప్రభుత్వం వాటిని నేరవేరుస్తుంది. మీరు ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో కలిసి అవినీతికి పాల్పడ్డారు. మేము మాత్రం కలిసి కట్టుగా దేశాభివృద్ధి కోసం పని చేస్తున్నాం. మీరు ప్రజల సొమ్ముతో శీష్ మహల్, బంగారు టాయిలెట్లు కట్టుకున్నారు. బీజేపీ సర్కారు పేదల కోసం ఇళ్లు, మరుగుదొడ్లు నిర్మించేందుకు సిద్ధమవుతోంది అని సీఎం రేఖా గుప్తా పేర్కొన్నారు.
పర్యాటక కేంద్రంగా ఢిల్లీ అభివృద్ధి
ఢిల్లీని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం యోచిస్తోందని.. అందుకు ప్రణాళికలను రచిస్తోందని సీఎం తెలిపారు. ఇందుకు రూ. 177 కోట్లను కేటాయించామని వెల్లడించారు. దీనిలో భాగంగా శీష్‌మహల్‌ను చూసేందుకు ప్రజలను అనుమతిస్తాం అని రేఖా గుప్తా పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను గద్దె దించి బీజేపీ అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.