2.5 లక్షల మంది ఉద్యోగులకు జీతాలు నిలిపివేసిన యోగి సర్కార్‌

Yogi Sarkar stopped the salaries of 2.5 lakh employees for the month of August

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఏకంగా 2,44,565 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఆస్తి వివరాలు వెల్లడించని ఉద్యోగులు అందరికీ ఆగస్టు నెల జీతాలను నిలిపివేసింది. ఉద్యోగులు ఆన్‌లైన్‌ వేదికగా తమ ఆస్తి వివరాలను ఆగస్టు 31 లోగా వెల్లడించాల్సి ఉంది. అయితే గడువు తేదీలోగా వివరాలను పొందుపరచకపోవడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో 2,44,565 మంది ఉద్యోగులకు ఆగస్టు నెల జీతాలు పడలేదని వివిధ ప్రభుత్వ విభాగాల రిపోర్టులు పేర్కొన్నాయి. కాగా ఆగస్టు 31 లోపు రాష్ట్ర ఉద్యోగులు అందరూ తమ ఆస్తుల వివరాలను అధికారిక పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే 71 శాతం మంది ఉద్యోగులు మాత్రమే సమాచారాన్ని అప్‌లోడ్ చేశారని ప్రభుత్వ నివేదిక చెబుతున్నాయి. కాగా ఐఏఎస్‌, ఐపీఎస్‌‌ల తరహాలో రాష్ట్ర స్థాయి ఉద్యోగులు అందరూఆస్తుల వివరాలు తెలియపరచడం అక్కడి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అయితే టీచర్లు, కార్పొరేషన్ ఉద్యోగులు, స్వయం ప్రతిపత్తి గల సంస్థల ఉద్యోగులను మాత్రం మినహాయించారు.