గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుండి ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తుండగా… గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అంతకు ముందు నల్ల కండువాలు, ప్లే కార్డ్స్‌తో నిరసన వ్యక్తం చేస్తూ వైసిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి చేరుకున్నారు. వారిని అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతిలో ప్లే కార్డులు లాక్కునే యత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, జగన్‌ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

ఇక దాదాపు 5 రోజుల పాటు జరిగే సమావేశాల్లో ప్రభుత్వం 3 శ్వేత పత్రాలను విడుదల చేయనుంది. అదే విధంగా ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రద్దు చేస్తూ, ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు సర్కార్‌ సిద్ధమైంది. మరో 3 నెలలకు ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది.

ఇక గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తూ.. ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు.విభజన వల్ల ఏపీకి నష్టం కలిగింది. రాజధాని హైదరాబాద్ ను కోల్పోయాం. సీఎం చంద్రబాబు విజనరీ నాయకుడు. 2014లో ఏపీ అభివృద్ధికి ఆయన తీవ్రంగా కృషి చేశారు. 2014-19 మధ్య రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగింది. రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ఎంతో కృషి చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు నష్టాలను చవిచూశాయని గవర్నర్ తెలిపారు.