Yash : దర్శక నిర్మాతలు పొగరనే ముద్ర కూడా వేశారు : యశ్ ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన కన్నడ స్టార్ యశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాకీ భాయ్‌గా యశ్ నటనకు ఫిదా కాని సినీ అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు.తన ఎనర్జిటిక్ ప్రదర్శన, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన తన తదుపరి చిత్రం ‘టాక్సిక్’లో నటించేందుకు సిద్ధమవుతున్నారు.ఇటీవల యశ్ ‘మనద కదలు‘ సినిమా ట్రైలర్ లాంచ్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు.యశ్ మాట్లాడుతూ “కెరీర్ ప్రారంభంలో నటుడిగా నా స్థానం సంపాదించుకోవడం చాలా కష్టమైనది. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంతో శ్రమించాను.అయితే నేను పని చేసేందుకు ముందు కథ పూర్తిగా తెలుసుకోవాలనుకునేవాడిని.

దర్శకులను పూర్తి స్క్రిప్ట్ చెప్పాలని అడిగేవాడిని. అదే కొంతమందికి నచ్చేది కాదు. దాంతో వారు నాకు పొగర అనే ముద్ర వేశారు,” అని చెప్పారు.అయితే ఈ కారణంగా చాలా మంచి అవకాశాలను కోల్పోయినట్లు యశ్ గుర్తు చేసుకున్నారు. “అలాంటి పరిస్థితుల్లో నిర్మాత కృష్ణప్ప నాకు బలమైన మద్దతుగా నిలిచారు. ఆయన నాపై నమ్మకం ఉంచారు. ఆ సమయంలో దర్శకుడు శశాంక్ నాకు పూర్తి కథ వివరించగా, ‘మోగ్గిన మనసు’ సినిమా నా కెరీర్‌ను మలుపుతిప్పింది. ఇప్పటికీ ఆ చిత్ర బృందంపై నాకు అపారమైన గౌరవం ఉంది,” అని యశ్ భావోద్వేగంగా తెలిపారు. యశ్ అభిప్రాయాలు కొత్త సినీ ఆశావాదులకు స్ఫూర్తినిచ్చేలా ఉన్నాయి. తన ప్రస్థానంలో ఎదురైన ఆటుపోట్లను అధిగమించి, దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యశ్ ప్రస్తుతం ‘టాక్సిక్’ చిత్రంతో మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ చిత్రం గురించి త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి.