అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే గుడ్లలో పురుగులు

ఇటీవల కాలంలో అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే గుడ్లకు సంబంధించి అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాడైపోయిన గుడ్లు..గడ్డకట్టిన మిల్క్ పాకెట్స్ ఇస్తున్నారని పిర్యాదులు ఎక్కువగా వస్తుండగా..తాజాగా పురుగులు పట్టిన గుడ్లు ఇవ్వడం ఇప్పుడు వైరల్ గా మారింది.

భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని బంజారాహిల్స్‌ అంగన్వాడీ నుంచి మూడేండ్ల చిన్నారి అభినాయక్​కు పౌష్టికాహారం కింద శనివారం 15 గుడ్లు అందించారు. ఈ గుడ్లతో వంట చేయడానికి సదరు కుటుంబసభ్యులు బుధవారం ప్రయత్నించగా, ఓ గుడ్డులో పురుగులు కన్పించాయి. దీంతో చిన్నారి తండ్రి భూక్యా సక్కునాథ్ ఫొటో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు. విషయం తెలుసుకున్న సీడీపీవో స్వరాజ్యం విచారణలో భాగంగా సక్కునాథ్ ఇంటికి వెళ్లి పురుగులు వచ్చిన గుడ్డును పరిశీలించారు. అనంతరం మరికొన్ని గుడ్లను పగలకొట్టి చూశారు. అయితే, ఏ గుడ్డులోనూ పురుగులు రాలేదు. తాము కొత్త స్టాకే పంపిణీ చేశామని, పురుగులు ఎలా వచ్చాయో తెలియదని ఆమె చెప్పారు. విషయాన్ని ఉన్నతాధికారులకు వివరిస్తామని సీడీపీవో తెలిపారు.