కేజ్రీవాల్ రాజీనామా చేస్తే..ఎవరికి దక్కేనో సీఎం పీఠం..

who-will-succeed-arvind-kejriwal-as-delhi-chief-minister

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి పదవికి మరో రెండ్రోజుల్లో రాజీనామా చేయబోతున్నట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేయడంతో.. మరి తదుపరి సీఎం ఎవరన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో పార్టీలోని కొందరి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. వారిలో వినిపిస్తున్న మొట్టమొదటి పేరు అతిశీ. కేజ్రీవాల్ జైలులో ఉండగా అన్నీ తానై పార్టీ వ్యవహారాలు చక్కదిద్దారు. ప్రభుత్వంలోని మొత్తం 14 విభాగాలకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. కేబినెట్ మంత్రుల్లో అత్యధిక విభాగాలు చూస్తున్నది ఆమెనే. విద్య, ఆర్థికం, ప్రణాళిక, పీడబ్ల్యూడీ, వాటర్, పవర్, పౌర సంబంధాలు వంటి శాఖలను అతిశీ నిర్వహిస్తున్నారు. ఎడ్యుకేషన్‌పై వేసిన స్టాండింగ్ కమిటీకి ఆమె చైర్ పర్సన్‌గానూ పనిచేశారు. బలమైన వాక్చాతుర్యం ఆమె సొంతం. వెరసి ముఖ్యమంత్రి పోస్టుకు పోటీపడుతున్న వారిలో ఆమె పేరు మొదటి వరుసలో ఉంది.

గోపాల్ రాయ్..

ఢిల్లీ సీఎం రేసులో ఉన్న మరో నేత గోపాల్‌రాయ్. 49 ఏళ్ల గోపాల్‌‌రాయ్‌కు పార్టీలో అట్టడుగుస్థాయి నుంచి పనిచేసిన అనుభవం ఉంది. విద్యార్థి రాజకీయ అనుభవం కూడా ఆయన సొంతం. ప్రస్తుతం ఆయన పర్యావరణం, అడవులు, వన్యప్రాణి సంరక్షణ, అభివృద్ధి, సాధారణ పరిపాలన విభాగం మంత్రిగా కొనసాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో జరిగిన కాల్పుల్లో ఆయన చేతికి గాయమైంది. ఢిల్లీలోని శ్రామిక-వర్గ సంఘాలతో ఆయనకు లోతైన అనుబంధం ఉంది. కార్మిక హక్కులలో ఆయన నేపథ్యం, పర్యావరణ సమస్యల పరిష్కారంలో ఆయన ప్రయత్నాల కారణంగా ప్రజల్లో ఆయనకు మంచి పేరు ఉంది. కాలుష్య నియంత్రణ నుంచి కార్మిక సంక్షేమం వరకు పలు ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడంలో ఆయన అనుభవం ముఖ్యమంత్రి పోటీదారుల్లో ఒకరిగా మార్చింది.

కైలాశ్ గెహ్లాట్

ఢిల్లీ రాజకీయాల్లో కైలాశ్ గెహ్లాట్ ప్రముఖ వ్యక్తిగా ఉన్నారు. రవాణాశాఖ మంత్రిగా చక్కని పనితీరు ప్రదర్శించారు. ఆయన నాయకత్వంలో ఢిల్లీ ప్రభుత్వం బస్సు సర్వీసుల విస్తరణ, ఎలక్ట్రిక్ బస్సుల పరిచయం, రహదారి భద్రతను పెంపొందించే ప్రయత్నాలు జరిగాయి. నగరంలో రవాణా, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడంలో విజయవంతమయ్యారు. 50 ఏళ్ల కైలాశ్‌కు పాలనా వ్యవహారాల్లో మంచి పట్టుంది. భారీ ప్రాజెక్టుల నిర్వహణలో, బ్యూరోక్రటిక్ సమస్యలను పరిష్కరించడంలో ఆయనకు మంచి పేరుంది. పార్టీలోని సీనియర్ నేతల్లో ఒకరైన ఆయన కూడా సీఎం పదవి రేసులో ఉన్నారు.

సునీతా కేజ్రీవాల్..

మాజీ అధికారి సునీతా కేజ్రీవాల్ కూడా భర్త అరవింద్ కేజ్రీవాల్ లానే ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ఎస్) మాజీ అధికారి. ఆదాయపన్ను శాఖలో రెండు దశాబ్దాలు పనిచేశారు. ఢిల్లీ, హర్యానా, గుజరాత్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన కుర్చీలో కూర్చుని కేజ్రీవాల్ సందేశాలను ప్రజలకు చదివి వినిపించారు. ఢిల్లీ, రాంచీలలో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ర్యాలీలలో పాల్గొన్నారు. ఆమె స్వతహాగా బ్యూరోక్రాట్ కావడంతో పలు సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించగలిగారు. వ్యవస్థలను అర్థం చేసుకోవడంలో నైపుణ్య ఉంది.

అడ్డుగా రాజ్యాంగ పరిమితులు..

సునీత రాజకీయేతర నేపథ్యం, రాజ్యాంగ పరిమితులు ఆమె ముఖ్యమంత్రి కావడానికి అవరోధంగా ఉన్నాయి. పార్టీలో ఆమె సభ్యురాలు కాకపోవడంతో తొలుత ఆమె ఆప్‌లో చేరాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక స్థానం నుంచి పోటీ చేయాలి. అవేవీ లేకుండా సీఎం కుర్చీలో కూర్చున్నా మూడు నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమయంలో ఉప ఎన్నిక నిర్వహించడం ఎన్నికల కమిషన్‌కు సవాలే. మరోవైపు, ఢిల్లీ అసెంబ్లీ కాలపరిమితి ఆరు నెలలలోపే ఉంది కాబట్టి సునీతను సీఎం చేసినా మళ్లీ ఎన్నికవాల్సిన అవసరం లేదన్నది పరిశీలకుల అభిప్రాయం. అయితే, ఒకవేళ ఆమెకు సీఎం పదవిని కట్టబెట్టినా కుటుంబ రాజకీయాలు అని ప్రతిపక్షాలు దాడి చేసే అవకాశం కూడా ఉందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. చూడాలి మరి.. ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కుతుందో!