వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. త్వరలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన, తమ పార్టీ గెలిచిన వెంటనే టీడీపీకి గట్టి సమాధానం ఇస్తామని హెచ్చరించారు. కడప, రాయచోటి ప్రాంతాల్లో జరిగిన వైసీపీ సమన్వయ సమావేశాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పెద్దిరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని, ఇదంతా చంద్రబాబు సహా టీడీపీ పెద్దల ప్రేరేపణతో జరుగుతోందని పేర్కొన్నారు. అయితే, తాము అధికారం లోకి రాగానే దీన్ని ఖచ్చితంగా ప్రతిదాడులతో ఎదుర్కొంటామని చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన తమ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి, ఎవరూ భయపడవద్దని, వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధైర్యం ఇచ్చారు. గతంలో టీడీపీ చేసిన అన్యాయాలకు బదులు తీర్చుకునేందుకు సమయం వస్తుందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం చూపిస్తున్న వేధింపులకు భయపడకుండా, పార్టీకి అండగా నిలవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
తమ హయాంలో రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరిగిందని, కానీ టీడీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు పాలనలో అవినీతి పెరిగిందని, అధికారాన్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు.