వైసీపీ పార్టీకి కీలక నేతగా పనిచేసిన విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది. ఈ సందర్భంగా అనేక అనుమానాలు, విశ్లేషణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆయనపై నమోదైన కేసులే రాజీనామాకు ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విజయసాయిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్న కేవీ రావు కేసు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాకినాడ సీపోర్ట్ యజమాని కేవీ రావును బెదిరించి షేర్లు బలవంతంగా తీసుకున్నారని, ఈ ఘటనపై CID కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముఖ్య నిందితులుగా జగన్, విజయసాయిరెడ్డి ఉన్నారు. దీనిపై ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా విచారణ జరిపింది. ఈ కేసు నేపథ్యంలో విజయసాయిరెడ్డిపై భవిష్యత్తులో శిక్షార్హ చర్యలు తీసుకునే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వమే ఈ కేసులను తీవ్రతరం చేయాలని నిర్ణయిస్తే, ఆయన అరెస్టు అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని కొందరు భావిస్తున్నారు. ఈ పరిణామాలే ఆయనను రాజకీయాల నుంచి వైదొలగేలా చేశాయని విశ్లేషకులు అంటున్నారు.