అణుబాంబుల సామర్థ్యం భారీగా పెంచుతాం: కిమ్‌

We will greatly increase the capacity of nuclear bombs.. Kim

ప్యాంగ్‌యాంగ్‌: భవిష్యత్తులో తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని భారీగా పెంచుకోనున్నట్లు ఉత్తరకొరియా నియంత కిమ్‌జోంగ్‌ఉన్‌ తెలిపారు. దేశ 76వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కిమ్‌ మాట్లాడారు. ‘యుద్ధంలో వాడేందుకు వీలుగా దేశ అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటాం. ఎంత పెంచాలనేదానికి హద్దే లేదు. దీనికి సంబంధించి పాలసీ రూపొందిస్తున్నాం.

ఉనికిని కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని కిమ్‌ చెప్పారు. కొరియా ద్వీపకల్పంలో ఇటీవలి కాలంలో దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ మధ్య సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో కిమ్‌ అణుబాంబుల పెంపు నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. నవంబర్‌లో అమెరికా ఎన్నికలు జరగనున్న వేళ ఉత్తరకొరియా న్యూక్లియర్‌ బాంబు పరీక్ష జరిపే ఛాన్సుందని దక్షిణకొరియా అధ్యక్షుని భద్రతాసలహాదారు ఇటీవలే వెల్లడించారు.

ఈ ఏడాది జులై నెలలో అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలు కలిసి సైనిక విన్యాసాలు నిర్వహించాయి. ఆ సందర్భంగా కొరియా సముద్రంలో అణ్వాయుధ సామర్థ్యం కలిగిన జలాంతర్గాములు, యుద్ధ నౌకలను అమెరికా మోహరించింది. అందుకే ఇప్పుడు అణ్వాయుధాల గురించి కిమ్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ దిశగా తాము కూడా సన్నద్ధం అవుతామని స్పష్టం చేశారు. అణ్వాయుధ శక్తిగా ఉత్తర కొరియా కూడా అవతరిస్తుందన్నారు. ఈ ఏడాది నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఆ సమయంలో ఉత్తర కొరియా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణులను ఇప్పటికే ఉత్తర కొరియా రెడీ చేసుకుంది. వాటిని తమ దేశంలో ఎక్కడి నుంచైనా ప్రయోగించేందుకు వీలుగా దాదాపు 250 మొబైల్ లాంచర్ వ్యవస్థలను సిద్ధం చేసింది. ఇటీవలే ఉత్తర కొరియాకు ఆత్మాహుతి డ్రోన్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. దాన్ని స్వయంగా కిమ్ జోంగ్ ఉన్ పరీక్షించారు.