అమెరికాలో ఎవరు గెలిచినా కలిసి పని చేస్తామనే విశ్వాసం ఉంది: జై శంకర్‌

We are confident that whoever wins in America will work together: Jai Shankar

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచినా… భారత్ వారితో కలిసి పని చేస్తుందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. మంగళవారం ఢిల్లీలో ఇండియాస్పోరా ఇంపాక్ట్ రిపోర్ట్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ… అమెరికా అధ్యక్ష ఎన్నికల అంశంపై స్పందించారు. సాధారణంగా ఇతర దేశాల ఎన్నికలపై మనం స్పందించబోమని… ఎందుకంటే ఇతరులు కూడా మన అంతర్గత అంశాల్లో మాట్లాడకూడదని భావిస్తామన్నారు. గత 20 సంవత్సరాలను పరిశీలిస్తే అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నప్పటికీ భారత్ కలిసి ముందుకు సాగిందన్నారు. అందుకే ఈసారి కూడా అతను (ట్రంప్) లేదా ఆమె (కమలాహారిస్) ఎవరు గెలిచినా కలిసి పని చేస్తామనే విశ్వాసం ఉందన్నారు.

అదే సమయంలో, ప్రస్తుతం మనం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నామని కేంద్రమంత్రి అన్నారు. ఉక్రెయిన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులను ఆయన ఉదహరించారు. తాను ఆశావాదినని… సమస్యలకు పరిష్కారాల గురించే ఆలోచిస్తానన్నారు. అయినప్పటికీ తాను ఒకటి కచ్చితంగా చెబుతున్నానని… మనం కఠిన పరిస్థితిని (ప్రస్తుత ప్రపంచ ఉద్రిక్తతల నేపథ్యంలో) ఎదుర్కొంటున్నామన్నారు. రానున్న ఐదేళ్లు చాలా క్లిష్టమైనది అన్నారు.

మిడిల్ ఈస్ట్‌లో ఏం జరుగుతోంది? ఉక్రెయిన్‌లో ఏమవుతోంది? ఆగ్నేయాసియా… తూర్పు ఆసియా… ఇలా వివిధ ప్రాంతాల్లో ఏమవుతుందో చూస్తూనే ఉన్నామన్నారు. అలాగే కొవిడ్ ప్రభావం నుంచి కొన్ని దేశాలు పూర్తిగా బయటపడలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక సవాళ్లను వెల్లడిస్తూ… ఈనాడు ఎన్నో దేశాలు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయని తెలిపారు. ఒకరు వాణిజ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటే… ఇంకొకరు విదేశీ మారకపు కొరతను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో వివిధ రకాల ఆటుపోట్లు ఉంటాయన్నారు. వాతావరణ మార్పులపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.