వయనాడ్‌ సహాయక చర్యలు..లెఫ్టినెంట్ కల్నల్‌ హోదాలో పర్యటించిన నటుడు మోహన్‌లాల్‌

Wayanad relief efforts..Actor Mohanlal visited as lieutenant colonel

వయనాడ్‌: కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. మంగళవారం తెల్లవారుజామున మెప్పాడి స‌మీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా కొండ‌చ‌రియ‌లు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అధికారిక సమాచారం మేరకు ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 358కు పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రకృతి విలయంతో అతలాకుతలమైన వయనాడ్‌లో మలయాళ నటుడు మోహన్‌లాల్‌ పర్యటిస్తున్నారు.

మోహన్‌లాల్‌ ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పర్యటన నిమిత్తం మెప్పాడి చేరుకున్న మోహన్‌లాల్‌కు సైన్యం స్వాగతం పలికింది. అనంతరం అక్కడ అధికారులతో మోహన్‌లాల్‌ భేటీ అయ్యారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ముండక్కై, చుర్‌ము లాల్‌ సహా కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అదేవిధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కూడా మోహన్‌లాల్‌ పరామర్శించనున్నారు. ఇక ఇప్పటికే బాధితులను ఆదుకునేందుకు మోహన్‌ లాల్‌.. కేరళ సీఎం సహాయ నిధికి రూ.25 లక్షలు విరాళంగా కూడా అందించారు. ఈ సందర్భంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్న వాలంటీర్లు, పోలీసులు, రెస్క్యూ టీమ్‌లు, ప్రభుత్వ అధికారుల కృషిని ఆయన ప్రశంసించారు.