వయనాడ్‌లో 300 దాటిన మృతుల సంఖ్య

Wayanad Landslide ..Death toll crosses 300; rescue ops continue

వయనాడ్‌ : కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి సృష్టించిన విలయంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 300 దాటింది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 308 మంది చనిపోయినట్టు అధికారులు నిర్దారించారు. డ్రోన్ ఆధారిత రాడార్ సాయంతో నాలుగో రోజు కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ విలయంలో 200 మందికిపైగా గాయపడ్డారు. భారీ వర్షాలు, ఘటన జరిగిన ప్రాంతానికి సజావుగా వెళ్లే పరిస్థితులు లేకపోవడం, భారీ పరికరాల కొరత వంటివి సహాయక చర్యలను ఆటంక పరుస్తున్నాయి. పేరుకుపోయిన బురద, నేల కూలిన వృక్షాలు, భవనాలను తొలగించడం కష్టంగా మారింది.

ఇండియన్ ఆర్మీ, ఎన్‌డీఆర్ఎఫ్, కోస్ట్‌గార్డ్, ఇండియన్ నేవీ బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. ఒక్కో బృందంలో ముగ్గురు స్థానికులు, అటవీశాఖ అధికారి కూడా ఉన్నారు. మొత్తం 40 బృందాలు ఆరు జోన్లుగా విడిపోయి సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.