ఏపీలో విజృంభిస్తున్న వైరల్ ఫీవర్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో 10రోజుల్లో సమారు 5లక్షల మంది బాధితులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం, తిరుపతి సహా పెద్ద నగరాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు జ్వర పీడితులతో కిక్కిరిశాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పితో ప్రారంభమై అత్యధికులు జ్వరాల బారిన పడుతున్నారు. జ్వరం తగ్గాక ఒళ్లు నొప్పులతో బాధపడేవారూ ఎక్కువగా ఉంటున్నారు. రోజురోజుకూ రాష్ట్రంలో వైరల్‌ జ్వరాల కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది.

పారిశుధ్యంలోపం, అడపాదడపా కురుస్తున్న వర్షాలు, వాతావరణంలో మార్పుల కారణంగా గ్రామాలు, పట్టణాలు అన్న తేడాలేకుండా పలురకాల జ్వరాలు విజృంభిస్తున్నాయి. దోమల నివారణకు స్థానిక సంస్థల అధికారులు, సిబ్బంది కనీస చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు మలేరియా, డెంగ్యూ జ్వరాలబారిన పడుతున్నారు. దీనికి తోడు వర్షాకాలం కావడంతో వైరల్‌ జ్వరాలు ప్రబలుతున్నాయి. చిన్న పిల్లల్లో వైరల్‌ జ్వరాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది.

అనధికార లెక్కల ప్రకారం ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉండనుంది. గతేడాది కంటే ఈసారి బాధితుల సంఖ్య 20-30% ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు ప్రతి ఇంట్లో ఒక రోగి ఉన్నారు. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ కేసులు బాగా పెరుగుతుండటంతో జ్వరాన్ని నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు.