నామినేషన్ వేసిన వినీష్ ఫొగాట్‌.. ఆస్తుల వివరాలు ఇవి..!!

రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేశ్ ఫోగట్ హర్యానా లోని జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బుధవారంనాడు నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆమె తన ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో పొందుపరిచారు.

వినేశ్​ తన వద్ద రూ.4కోట్లకు పైగా విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్లు తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సోనిపత్‌లో రూ.2కోట్లు విలువ చేసే స్థిరాస్తి, అందులో మూడు కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు. అందులో రూ.35 లక్షల విలువ చేసే వోల్వో ఎక్స్‌సీ 60, రూ.12 లక్షల విలువ చేసే హ్యుందాయ్‌ క్రెటా, రూ.17లక్షల గల టొయోటా ఇన్నోవా కార్లు ఉన్నట్లు తెలిపింది. ఇన్నోవా కోసం రూ.13 లక్షల అప్పు తీసుకున్నానని, ప్రస్తుతం ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నట్లు తెలిపారు. తన భర్త సోమ్‌వీర్‌ రాఠీ పేరిట రూ.19లక్షల విలువైన మహీంద్రా స్కార్పియో కారు కూడా ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొంది.

అలాగే ప్రస్తతం తన చేతిలో రూ.1.95లక్షల నగదు ఉన్నట్లు వినేశ్‌ తెలిపారు. మూడు బ్యాంకుల్లో దాదాపు రూ.39లక్షలు డిపాజిట్లు ఉండగా, ఆమె భర్తకు మరో రూ.30లక్షలకు మేర బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయని తెలిపింది. 35 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి ఆభరణాలు కూడా తన వద్ద ఉన్నట్లు పేర్కొన్నారు. దీని విలువ రూ.2.74లక్షల మేర ఉంటుంది. ఇక భర్తకు 28 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి ఉన్నట్లు తెలిపారు.

ఇక వినీష్ నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ ఎస్ హుడా, ఇతర నేతలు పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం వినేశ్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావడం అదృష్టంగా భావిస్తున్నానని, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి తాను పాటుపడతానని హామీ ఇచ్చారు. జులానా ప్రజలు తనపై చూపుతున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, శత్రువు బలహీనుడని ఎప్పుడూ అనుకోరాదని తాను రెజ్లింగ్‌ నుంచి నేర్చుకున్నానని, అదే స్ఫూర్తితో తాను రాజకీయాల్లోనూ కష్టపడతామని తెలిపారు.