రాహుల్ గాంధీతో వినేశ్, బజరంగ్ భేటీ

Vinesh, Bajrang meet with Rahul Gandhi

హైదరాబాద్‌: ప్యారిస్ ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన స్టార్ అథ్లెట్, రెజ్లర్ వినేశ్ ఫోగాట్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా.. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా.. అంటే అవుననే వినిపిస్తోంది. రెజ్లర్లు వినేశ్ ఫోగాట్, బజరంగ్ పూనియా ఎన్నికల బరిలోకి దిగనున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగ్గట్లే వారిరువురూ బుధవారం ఉదయం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాహుల్ గాంధీతో కలిసి వినేశ్, బజరంగ్ దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొని ఢిల్లీకి తిరిగి వచ్చిన వినేశ్ ఫోగాట్ కు ఢిల్లీ ఎయిర్ పోర్టులో కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా స్వాగతం పలికారు.

అంతకుముందు కూడా వినేశ్‌ను రాజ్యసభకు పంపాలంటూ కొంతమంది కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో రెజ్లర్ల రాజకీయ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారం నిజమేనని పలువురు చెబుతున్నారు. రెజ్లర్లు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వినేశ్ ను పార్టీలో చేర్చుకుని హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. గతేడాది బీజేపీలో చేరి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన బబితా ఫోగాట్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బబితను మరోమారు పోటీ చేయించాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో బబితకు పోటీగా వినేశ్ ను నిలబెట్టాలని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అయితే, రాహుల్ గాంధీతో రెజ్లర్ల భేటీకి సంబంధించిన వివరాలను అటు కాంగ్రెస్ పార్టీ కానీ, ఇటు వినేశ్, బజరంగ్ పూనియా కానీ బయటపెట్టలేదు. మరోవైపు, హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసే విషయంపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. దీనిపై సోమవారం భేటీ అయిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ.. 34 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఒకటి, రెండు రోజుల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తో పొత్తు పెట్టుకునే విషయాన్ని పరిశీలించాలంటూ రాహుల్ గాంధీ పార్టీకి సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. పొత్తుపై రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.