గణపతి పూజలో ‘గరిక’కు ప్రాధాన్యం.. కారణం ఏంటి..?

వినాయకచవితి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఊరూరా, వాడవాడనా మండపాలు వెలిశాయి. గణపతి విగ్రహాలు కూడా మండపాలకు చేరుతున్నాయి. ఇక మిగిలింది ప్రతిష్ఠించడమే. అయితే, చవితి వేడుకలంటే ఆటపాటల సంబరాలే కాదు, పూజలో వాడే ఎన్నో రకాల పుష్పాలు ..ముఖ్యంగా పత్రిలో గరిక ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకోవాలి.

చవితి పూజలో ఎన్ని రకాల పుష్పాలు వాడినా పత్రిలో గరిక లేకపోతే వినాయకుడు లోటుగా భావిస్తాడని పూజారులు చెబుతున్నారు. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడి పుట్టించి దేవతల్ని ఇబ్బందులకు గురిచేశాడట. ఆ రాక్షసుడిని గణేశుడు మింగేయడంతో ఆయన శరీరం వేడిగా మారిందట. దీంతో రుషుల సూచనతో 21 గరిక పోచలను స్వామి తలపై పెట్టగా, వేడి తగ్గిపోయిందట. అందుకే పూజలో గరికకు ప్రాధాన్యం దక్కినట్లు చెబుతారు. వినాయక చవితి పూజ చాలా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాల్సిన పండుగ. ఏ ఒక్క వస్తువు కూడా లోటు లేకుండా అన్నీ ముందుగా సమకూర్చుకోవాలి. వినాయక చవితి పండుగను కుల, మత, జాతులకు అతీతంగా జరుపుకోవడం మరో విశేషం. గణనాథుడి పూజకు భక్తిశ్రద్ధలు ఎంత ప్రధానమో పూజలో పొరపాట్లు చేయకుండా ఉండడం కూడా అంతే ప్రధానం.