కవితకు బెయిల్ రావడంపై వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

డిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు బెయిల్ రావడం ఫై బిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే..బిజెపి , కాంగ్రెస్ నేతలు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పలు రకాలుగా స్పందించగా..తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఇన్నాళ్లు ఆమెకు బెయిల్ నిరాకరించిన న్యాయస్థానం.. ఎట్టేకేలకు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు ఎందుకు ఇచ్చిందనే విషయంపై ప్రస్తుతం అందరికీ అనుమానం కలుగుతోందన్నారు.

కవిత బెయిల్‌పై సీబీఐ, ఈడీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ అంతర్గత ఒప్పందం కుదుర్చుకోవడం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని జోరుగా ప్రచారం జరుగుతోందని అన్నారు. దర్యాప్తు సంస్థలు కూడా సుప్రీంలో కౌంటర్ పిటిషన్స్ వేయలేదని, దర్యాప్తు పూర్తయినట్లు ఒప్పుకున్నాయని చెప్పినట్లు గుర్తుచేశారు. అయితే, చట్టం అందరికీ సమానమేనని, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తుది తీర్పు వచ్చాకే తాను మళ్లీ మాట్లాడుతానని వీహెచ్ వెల్లడించారు.