కూరగాయలు ఫ్రీ ..ఫ్రీ

ప్రస్తుతం మార్కెట్ లో కూరగాయల ధరలు మండి పోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని కూరగాయల ధరలు పెరిగాయి. టమాటా ధర గతంలో కంటే కొంత తగ్గినప్పటికీ మిగిలిన కూరగాయల ధరలు మాత్రం వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. బెండకాయలు, దొండకాయలు, ఆలుగడ్డ, చిక్కుడు కాయ, వంకాయ, పొట్లకాయ వంటి కూరగాయల ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వినియోగదారులు కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు.

కానీ పెద్దపల్లిలో మాత్రం ఉచితంగా అందిస్తున్నారు. అదేంటి అనుకుంటున్నారా.. కానీ ఇది నిజం. మంగళవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో వ్యాపారులు టన్నుల కొద్ది కూరగాయలను ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఫ్రీగా కూరగాయలు అందిస్తున్నారని తెలియడంతో ప్రజలు వేలాదిగా తరలివచ్చి సంచులు సంచులుగా కూరగాయలు తీసుకొనివెళ్ళారు. అసలు విషయం ఏంటంటే కూరగాయల మార్కెట్లో హోల్సేల్, రిటైల్ కూరగాయల వ్యాపారుల మధ్య వివాదం నెలకొనడంతో రిటైల్ వ్యాపారులు ఉచితంగా కూరగాయలు అందజేశారు.

ఒప్పందం ప్రకారం హోల్సేల్ వ్యాపారులు రిటైల్ గా కూరగాయలు అమ్మ వద్దని ఉండగా వారు నిబంధనలు అతిక్రమించి కిలోల చొప్పున కూరగాయలు రోజు మొత్తం అమ్ముతుండడంతో ఆగ్రహించిన రిటెయిల్ వ్యాపారులు మంగళవారం కూరగాయలన్నీ ఫ్రీగా పంచిపెట్టారు.