ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీర రాఘవరెడ్డి ఇటీవల చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై దాడి చేసిన ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు, హిందూ సంఘాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. ఈ కేసులో వీర రాఘవరెడ్డితో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేసి, ప్రస్తుతం రిమాండ్‌కు తరలించారు.
వీర రాఘవరెడ్డిపై గతంలోనూ కేసులు
పోలీసుల రిమాండ్ రిపోర్ట్ ప్రకారం, వీర రాఘవరెడ్డిపై 2015, 2016 సంవత్సరాల్లోనే పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు వెల్లడైంది. తనను శివుడి అవతారంగా ప్రచారం చేసుకుంటూ, రామరాజ్యం స్థాపన అనే పేరుతో అనుచరులను నియమించుకోవడం, ప్రత్యేకంగా సైన్యాన్ని ఏర్పాటుచేయడం వంటి కార్యకలాపాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అలాగే, “దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ” అనే పేరుతో రామరాజ్యం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అనేక వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా పోలీసుల దృష్టికి వచ్చింది.

పూజారులను బెదిరించడం అలవాటుగా మార్చుకున్న వీర రాఘవరెడ్డి
వీర రాఘవరెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులే స్వయంగా వెల్లడించిన ప్రకారం, ఆయన పూజారులను బెదిరించడం అలవాటుగా మార్చుకున్నారని, తన రామరాజ్య ఆలోచనకు మద్దతుగా రావాలని మత పెద్దలను ఒత్తిడి చేసేవారని సమాచారం. రామరాజ్యం పేరుతో ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఆర్థికంగా సాయం చేయాలని అనుచరులను ఒప్పించడం, తన ధార్మిక ఉద్యమానికి మద్దతుగా రావాలంటూ పలువురిని బెదిరించడం కూడా రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం
పోలీసుల అభిప్రాయం ప్రకారం, వీర రాఘవరెడ్డిని అరెస్ట్ చేయకుంటే, భవిష్యత్తులో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది. చిలుకూరు అర్చకుడు రంగరాజన్‌పై జరిగిన దాడి చిన్న సంఘటనగా అనిపించినా, దీని వెనుక ఆయన పెద్ద కుట్ర పన్నినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. రంగరాజన్‌ను భయపెట్టడానికి మాత్రమే కాకుండా, ఉగాది లోపు తన రామరాజ్యం భావనను అంగీకరించాలని హెచ్చరించాడని పోలీసులు పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
ఇప్పటికే వీర రాఘవరెడ్డి సంబంధిత అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో జిల్లా కలెక్టర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారి (సీఐ)తో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో కలకలం రేపుతోంది. చట్టాన్ని మీరెలా తీసుకుంటారని సీఐ ప్రశ్నించగా, “చట్టం అన్నీ హక్కులు ఇస్తుంది” అంటూ సమాధానం ఇచ్చినట్లు ఆ ఆడియోలో ఉంది. అయితే ఇది నిజంగా వీర రాఘవరెడ్డి వాయిస్‌నా? కాదా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. అలాగే, ఒక వ్యక్తిని “రామరాజ్యం రాజు” అంటూ ప్రమాణం చేయించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును మరింత లోతుగా విచారిస్తుండగా, వీర రాఘవరెడ్డి ఆస్తులు, ఆయన గత చరిత్రపై కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.