సిమెంట్‌ స్లాబ్‌ను ఢీ కొన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్

Vande Bharat Express collided with cement slab

న్యూఢిల్లీ : జోధ్‌పూర్‌ వెళ్లే వందే భారత్‌ రైలు ప్రమాదానికి గురైంది. పట్టాలపై ఉంచిన సిమెంట్‌ స్లాబ్‌ ను ఢీ కొట్టింది. అయితే, అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 23న రాజస్థాన్‌ లోని పాలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అహ్మదాబాద్‌ నుంచి జోధ్‌పూర్‌ వెళ్తున్న రైలు పాలి జిల్లాలో సుమెర్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జవాయి-బిరోలియా సెక్షన్ మధ్య పట్టాలపై ఉంచిన సిమెంట్‌ స్లాబ్‌ను ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ప్రమాదం కారణంగా రైలు కొంత ఆలస్యంగా గమ్య స్థానానికి చేరినట్లు నార్త్‌ వెస్ట్‌ సీపీఆర్‌వో శశికిరణ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఫల్నా ప్రాంతానికి చెందిన సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రైల్వే ట్రాక్‌పై ఫుట్‌పాత్‌ల నిర్మాణానికి ఉపయోగించే సిమెంట్‌ స్లాబ్‌ ముక్కలు కనిపించినట్లు తెలిపారు. అహ్మదాబాద్‌ – జోధ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది. సబర్మతి స్టేషన్ నుండి సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి రాత్రి 10.50 గంటలకు జోధ్‌పూర్ చేరుకుంటుంది.

కాగా, కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్‌ వందే భారత్‌ రైళ్లు వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. అక్కడ ఆవును ఢీకొన్నది.. ఇక్కడ బర్రెను ఢీకొట్టింది.. రైళ్లపై రాళ్లు రువ్వడం వంటి వార్తలను తరచూ వింటూనే ఉన్నాం. ప్రమాదాల్లో రైలు ఇంజిన్‌ ముందు భాగం దెబ్బతినడం, అద్దాలు ధ్వంసం వంటి ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా జోధ్‌పూర్‌ వెళ్లే వందే భారత్‌ రైలు ప్రమాదానికి గురైంది.