ఉత్తమ్ భాష మార్చుకోవాలి: జగదీశ్‌ రెడ్డి హితవు

jagadish reddy
jagadish reddy

హైదరాబాద్‌: నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని జరిగిందంటూ మాజీ సీఎం కేసీఆర్‌పై ఆయన ఉపయోగించిన పదజాలంపై తీవ్రంగా స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టపగలు నోట్లకట్టలతో దొరికిన దొంగలు మీరేనని.. రేవంత్‌ని అనాల్సిన మాటలు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి బీఆర్‌ఎస్‌పై వాడుతున్నారని విమర్శించారు. రేవంత్‌ని అనడం చేతగాక కేసీఆర్‌పై ఏడుస్తున్నారన్నారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన మీరు డెకాయిట్లని.. పదేళ్లు ప్రజాసంక్షేమం కేసీఆర్‌ పాటుపడ్డారన్నారు. ఉత్తమ్ భాష మార్చుకోవాలని హితవు పలికారు. ఎప్పుడూ ఇలాంటి మాటలు కేసీఆర్‌ మమ్మల్ని మాట్లాడనివ్వలేదన్నారు. నీకంటే వెనక వచ్చిన వాడు సీఎం పదవి గుంజుకుంటే చేతగాని దద్దమ్మ ఉత్తమ్ అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోనే డెకాయిట్ల పరిపాలన సాగితుందని.. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ నాయకుల కమీషన్లు , దోపిడీ గురించి ప్రజలు చెబుతారన్నారు.

ఏళ్లుగా కట్టిన ప్రాజెక్టుల నుంచి నీటిని అందించడం చేతగాక అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారన్నారు. నీటి కోసం, విద్యుత్ కోసం ధర్నాలు జరుగుతున్నాయని.. ముందు వాటి గురించి మాట్లాడాలన్నారు. అడ్డగోలుగా మాట్లాడితే నిన్న రేవంత్‌కి పడ్డ చీవాట్లు ఉత్తమ్‌కి తప్పవన్నారు. తిట్ల దండకం మాట్లాడితే చీవాట్లు తప్ప ఉత్తమ్ సీఎం కాలేరన్నారు. సాగునీటి ధర్నాలు ఇలానే కొనసాగితే యాసంగి నాటికి ప్రజల్లో తిరగలేరన్నారు. ప్రజాధనంతో హెలికాప్టర్లలో తిరుగుతూ ఉత్తమ్ సొల్లు మాట్లాడుతున్నారని.. సాగునీరు అందించలేక ఇరిగేషన్ మంత్రిగా విఫలం అయ్యారని మండిపడ్డారు. చేతకాకపోతే మంత్రి పదవిపై ఉత్తమ్ పునరాలోచన చేయాలన్నారు. కాళేశ్వరం నీటిని అందించకపోతే కాంగ్రెస్ నాయకులకు రైతులతో దెబ్బలు తప్పవని.. రైతాంగ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఆదుకోవాలని రైతుల నుండి విజ్ఞప్తులు వస్తున్నాయని.. త్వరలోనే రైతాంగ సమస్యలపై కేసీఆర్ కార్యచరణ ప్రకటిస్తారన్నారు. ప్రభుత్వం మెడలు వంచి రైతులను ఆదుకునేలా చేస్తామన్నారు.