మహేష్ బాబు ఇంట మరో విషాదం

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మహేష్ బాబు మేనమామ , ప్రముఖ నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు (73) కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన..ఈరోజు ఉదయం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

సూర్యనారాయణ బాబు స్వయానా హీరో కృష్ణ చెల్లెలి భర్త. లక్ష్మి తులసిని పెళ్లి చేసుకున్న సూర్యనారాయణ.. నిర్మాతగా పలు విజయవంతమైన సినిమాలు పద్మావతి బ్యానర్ పై నిర్మించారు. హీరో కృష్ణ స్వయంగా ప్రోత్సహించి తన పద్మాలయా బ్యానర్ లాగా పద్మావతి బ్యానర్ ను బావగారితో పెట్టించి తాను కూడా దగ్గరుండి నిర్మాణ బాధ్యతలు చూసుకునేవారు.

పద్మావతి ఫిలిమ్స్ బ్యానర్ పై ఆయన మనుషులు చేసిన దొంగలు సినిమాతో నిర్మాతగా మారారు. 1977లో విడుదలైన ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత దొంగల దోపిడీ, రామ్ రాబర్ట్ రహీమ్, బజార్ రౌడీ, శంఖారావం వంటి చిత్రాలను నిర్మించి కమర్షియల్ నిర్మాతగా ఆర్థిక విజయం అందుకున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో రెండు హిందీ చిత్రాలను నిర్మించారు. కన్నడంలోనూ అగ్ర హీరో అంబరీష్ తో రెండు సినిమాలు తీశారు.