ఇకపై హోటళ్లకు నేమ్ ప్లేట్ ఉండాల్సిందే: సీఎం యోగి ఆదిత్యనాథ్‌

UP eateries on Kanwar routes must display owners’ names: Yogi Adityanath

లఖనవూ : కన్వర్ యాత్ర మార్గంలో హోటళ్ల యజమానుల పేర్లు ప్రదర్శించాల్సిందేనని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్పష్టం చేశారు. యాత్రికుల విశ్వాసాలను గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎంఓ వెల్లడించింది. ఇదే విషయమై ముజఫర్‌నగర్‌ పోలీసులు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు రాజకీయ వివాదానికి దారితీశాయి. అయినా సరే యూపీ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడం గమనార్హం.

కన్వర్‌ యాత్రకు వెళ్తున్నవారు ఫక్తు శాకాహారం ఎక్కడ లభ్యమవుతుందో తెలుసుకునేందుకే ఈ నిబంధన విధించినట్లు పోలీసులు చెబుతుంటే విపక్షం మాత్రం దీనిని తీవ్రంగా తప్పుపడుతోంది. భారత సంస్కృతిపై ఇదొక దాడి అని కాంగ్రెస్‌ విరుచుకుపడింది. ఈ ఉత్తర్వు పూర్తి వివక్షపూరితమని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. యూపీలో ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చేయడమే దీని ఉద్దేశమని ఆరోపించారు. సామాజిక నేరంలాంటి ఈ ఉత్తర్వుపై కోర్టులు సుమోటోగా తీసుకొని విచారణ జరపాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ డిమాండ్‌ చేశారు.

బీజేపీ, వీహెచ్‌పీ మాత్రం యూపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి. ఉపవాస దీక్షలో ఉండేవారు కేవలం శాకాహారం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకునేందుకు ఇది ఉపకరిస్తుందని వెల్లడించాయి. యజమానులు, కార్మికుల పేర్లు, ఫోన్‌ నంబర్లను ఆహారశాలలపై ప్రదర్శించినంత మాత్రాన లౌకికవాదానికి ఎలాంటి భంగం కలగదని వ్యాఖ్యానించాయి. జులై 22 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రలో భాగంగా ఏటా శ్రావణ మాసంలో పక్షం రోజుల పాటు శివ భక్తులు గంగా నదీజలాలను సేకరిస్తుంటారు.