చంద్రయాన్‌-4కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

Union Cabinet approves Chandrayaan-4

న్యూఢిల్లీ : చంద్రుడిపైకి భారతీయ వ్యోమగాములను పంపేందుకు అవసరమైన సాంకేతికతల అభివృద్ధి, ప్రదర్శన కోసం చేపట్టనున్న ‘చంద్రయాన్‌-4’ మిషన్‌కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.2,104.06 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. శుక్రగ్రహాన్ని అధ్యయనం చేయడం కోసం దాని కక్ష్యలోకి వ్యోమనౌకను పంపించేందుకు చేపట్టనున్న ‘వీనస్‌ ఆర్బటర్‌ మిషన్‌'(శుక్రయాన్‌-1)కు రూ.1,236 కోట్లు కేటాయించింది. పాక్షిక పునర్వినియోగానికి అవకాశం ఉండే నెక్ట్స్‌ జెనెరేషన్‌ లాంచ్‌ వెహికిల్‌(ఎన్జీఎల్వీ)కి సైతం క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగా కీలకమైన ఎన్జీఎల్వీతో పాటు మూడు డెవలప్‌మెంటల్‌ విమానాలు, ఇతర అవసరమైన సాంకేతికత అభివృద్ధి కోసం రూ.8,240 కోట్లు కేటాయించింది.

చంద్రయాన్‌-3 విజయంతో ఉత్సాహంగా ఉన్న ఇస్రో 2040 నాటికి చంద్రుడి పైకి భారతీయ వ్యోమగాములను పంపి, సురక్షితంగా తిరిగి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకు అవసరమైన సాంకేతికతలను దేశీయంగానే అభివృద్ధి చేసి, ప్రదర్శించడమే చంద్రయాన్‌-4 మిషన్‌ లక్ష్యం. 36 నెలల కాలంలో ఈ మిషన్‌ను పూర్తి చేయాలని ఇస్రో భావిస్తున్నది. ఇందులో భాగంగా ఇస్రో స్వయంగా వ్యోమనౌకను అభివృద్ధి చేసి, ప్రయోగించనున్నది. ఇప్పటికే చంద్రయాన్‌-3 ద్వారా చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్‌ అవగలిగే సాంకేతికతను ప్రదర్శించామని, చంద్రయాన్‌-4 ద్వారా వ్యోమగాములను సురక్షితంగా తిరిగి తీసుకురావడం కీలక లక్ష్యమని ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌ తెలిపారు.