రామగుండం ఓసీపీ లో ప్రమాదం..ఇద్దరు కార్మికుల మృతి

రామగుండం సింగరేణి ఓపెన్ కాస్ట్‌ ప్రాజెక్టులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవ సమాధి కాగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని రామగుండం-3 డివిజన్ పరిధి ఓసీపీ-2లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్వారీలోని సౌత్‌కోల్ ఏరియాలోని సైడ్‌వాల్ లోపల నలుగురు కార్మికులు పైపులైన్ లీకేజీ మరమ్మతు పనులు చేస్తుండగా హైవాల్‌లో బురదమట్టి (ఓబీ) ఒక్కసారిగా వారిపై పడింది.

దీంతో సింగరేణి టెక్నీషియన్ (ఫిట్టర్) ఉప్పుల వెంకటేశ్వర్లు (58), జనరల్ మజ్దూర్ కార్మికుడు గాదం విద్యాసాగర్ (55) ఆ మట్టిలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కార్మికులు జనరల్ మజ్దూర్ కార్మికులు శ్రీనివాస్‌రాజు, మాదాం సమ్మయ్య తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే మిగతా కార్మికులు అప్రమత్తమై మట్టిని తొలగించే ప్రయత్నం చేసినా వారి ప్రాణాలు కాపాడలేకపోయారు. గాయపడిన ఇద్దరిని గోదావరిఖని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు.