అమరావతి : ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ , డాక్టర్ యడవల్లి లక్ష్మణరావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నూతన జడ్జిలను పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు అభినందించారు.

రాష్ట్ర హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులకు గాను ప్రస్తుతం 28 మంది పనిచేస్తున్నారు. ఇద్దరి నియమకంతో ఆ సంఖ్య 30కు చేరుకోంది. మరో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఇద్దరు రెండేళ్ల పాటు అదనపు న్యాయమూర్తులుగా , ఆతరువాత శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులవుతారు. ప్రకాశం జిల్లాకు చెందిన జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు , కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తిగా హరిహరనాథ శర్మ పలు కోర్టుల్లో వివిధ సేవలను అందించారు.
కాగా, రాష్ట్ర హైకోర్టుకు ఇద్దరు అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. అదనపు న్యాయమూర్తులుగా న్యాయాధికారులు అవధానం హరిహరనాథశర్మ, డాక్టర్ యడవల్లి లక్ష్మణరావుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో వారిని నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. కొత్త న్యాయమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు.