హైదరాబాద్ మీర్‌పేట వెంకటమాధవి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. సంక్రాంతి రోజు తన భార్య మాధవిని రిటైర్డ్ జవాన్ గురుమార్తి దారుణంగా హత్య చేశాడు. తన భార్య తలను గోడకేసి బాదడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆమె శవాన్ని ముక్కలు చేసి, వాటిని వాటర్ హీటర్‌లో ఉడికించి, ఎముకలను పొడి చేసి చెరువులో పడేశాడని నిందితుడు పోలీసుల ఎదుట వెల్లడించాడు. ఈఘటనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి రావడంతో అందరూ షాక్‌కు గురయ్యారు.
పోలీసులు ఈ కేసును సైంటిఫిక్ ఆధారాలతో ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, అతడిపై బీఎన్ఎస్ యాక్ట్ 103(1), 238, 85 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హత్యకు ఉపయోగించిన 16 వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కేసులో మరో కీలక విషయం బయటకు వచ్చింది. గురుమార్తికి ఈ హత్యలో మరో ముగ్గురు కుటుంబ సభ్యులు సహాయపడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే, వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

నిందితుడు గురుమార్తిని శనివారం నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. అతని దగ్గర నుంచి మరిన్ని కీలక వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. హత్య అనంతరం తన భార్య మాధవి మిస్సింగ్ అయిందంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం, తల్లిని కూడా మోసగించడం అతడి కుతంత్రానికి నిదర్శనం.
గురుమార్తికి గతంలో ఓ మహిళతో పరిచయం ఏర్పడగా, అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసిన మాధవి కుటుంబ సభ్యులు అతడిపై దాడి చేయడంతో, భయపడిన అతను హత్యకు పాల్పడ్డాడు. తన భర్త నుంచి ఇలాంటి దారుణం ఎదురవుతుందని మాధవి ఊహించలేకపోయింది. ఈ కేసు ఇప్పటికీ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మాధవి మృతదేహాన్ని పూర్తిగా మాయం చేయడం, పోలీసుల్ని మభ్యపెట్టేలా వ్యవహరించడం అతడి మానసిక స్థితిని తెలియజేస్తోంది. పరారీలో ఉన్న ముగ్గురు కుటుంబీకులను త్వరగా పట్టుకోవాలని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని మాధవి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.