ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు లో నిందితుడు కామేపల్లి తులసి బాబు ను గుంటూరు కోర్టు మూడు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో సోమవారం నుంచి మూడు రోజుల పాటు తులసి బాబును ఎస్పీ దామోదర్ విచారించనున్నారు. ఈనెల 8న తులసి బాబును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతను గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో తులసి బాబును విచారించనున్నారు.

హైదరాబాద్‌లో తనను అరెస్టు చేయడానికి కొద్ది గంటల ముందే ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ రాసిన లేఖే తన హత్యకు కుట్ర జరిగిందనడానికి మరో ఆధారమని రఘురామ తెలిపారు. ‘వీఐపీ వస్తున్నారు.. జీజీహెచ్‌లో గుండె వైద్య నిపుణుడిని అందుబాటులో ఉంచాలని సూపరింటెండెంట్‌ను అప్రమత్తం చేస్తూ ముందుగానే కలెక్టర్ లేఖ రాశారు. కాగా.. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రైవేటు వ్యక్తి అయిన తులసిబాబును ఈనెల 8న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు విచారణ జరిపిన పోలీసులు ఆపై అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోలీసు కస్టడీలో ఉన్న రిటైర్డ్ ఏఎస్పీ విజయ్‌పాల్‌ను తులసి బాబును ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నలు సంధించారు. అనంతరం విజయ్‌పాల్‌ను పంపించి వేసి తులసి బాబు ప్రత్యేకంగా విచారించారు. ఈ క్రమంలో కొంత మేర సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.