పంజాబ్‌లోని రూప్ నగర్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ హర్పిందర్ సింగ్ కు అదృష్టం తలుపుతట్టింది. పంజాబ్ స్టేట్ డియర్ లోహ్రీ మకర సంక్రాంతి బంపర్-2025 లాటరీలో రూ. 10 కోట్లు గెలుచుకున్నాడు. ఇప్పటివరకు అందించిన అతిపెద్ద లాటరీ ప్రైజ్ మనీగా నిలిచింది. సింగ్ ప్రస్తుతం కువైట్లో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సెలవులపై స్వగ్రామానికి వచ్చిన సమయంలో రూ. 500 పెట్టి లాటరీ టికెట్ కొని తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు. గత 15 ఏళ్లుగా లాటరీలు కొంటున్నప్పటికీ, ఈ స్థాయిలో ఎప్పుడు డబ్బులు రాలేదు.
ఈ లాటరీ గెలుపుతో అతని కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. హర్పిందర్ సింగ్ మాట్లాడుతూ..ఈ గెలుపు తన జీవితాన్ని మెరుగుపరచడానికి, కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకునేందుకు పెద్ద అవకాశమని భావిస్తున్నట్లు తెలిపారు. లాటరీ ద్వారా వచ్చిన డబ్బుతో పిల్లల విద్య, కుటుంబ అవసరాలు తీర్చుకోవడంతో పాటు, ఇతరులకు సహాయం చేయాలని ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నాడు. అతని గెలుపు పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. 15 ఏళ్లుగా నమ్మకంతో లాటరీలు కొంటున్న సింగ్ కు చివరికి విజయం దక్కడం అతని పట్టుదలకి నిదర్శనమని వారు వ్యాఖ్యానించారు. పంజాబ్ ప్రభుత్వం ఈ లాటరీ విజయానికి సంబంధించి అతడికి అధికారికంగా బహుమతిని అందజేస్తూ సత్కరించనుంది.