ఝార్ఖండ్‌లో రైలు ప్రమాదం.. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడదా?: మమతా బెనర్జీ

Train accident in Jharkhand.. Central government neglect?: Mamata Banerjee

రాంఛీ: ఝార్ఘండ్‌ లోని చక్రధర్‌పూర్‌ వద్ద ఈరోజు(మంగళవారం) హావ్‌డా-ముంబయి మెయిల్‌ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కాగా ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎక్స్‌ వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

”ఝార్కండ్‌లోని చక్రధర్‌పూర్‌ వద్ద హావ్‌డా-ముంబయి మెయిల్‌ రైలు ప్రమాదం జరిగింది. కొందరు చనిపోగా.. మరికొందరు గాయపడ్డారు. దేశంలో రైలు ప్రమాదాలు సహజంగా మారిపోతున్నాయి. ప్రతివారం ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇంకా ఎంతకాలం వీటిని సహించాలి. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడదా? ఇదేనా కేంద్ర ప్రభుత్వ పాలన?” అంటూ ప్రశ్నించారు.

మరోవైపు ఝార్ఖండ్‌ ఎమ్మెల్యే కల్పనా సోరెన్ ఈ ప్రమాద ఘటనపై విచారం వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

కాగా, ఝార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్‌ వద్ద ముంబయి-హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం నేపథ్యంలో హావ్‌డా-టిట్లాఘఢ్‌-కాంటాబాంజీ ఇస్పత్‌ ఎక్స్‌ప్రెస్‌, హావ్‌డా-బార్బిల్‌ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు ఎస్‌ఈఆర్‌ తెలిపింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది.

ఘటనా స్థలానికి కొంతదూరంలో మరో గూడ్స్‌ రైలు కూడా పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు ప్రమాదాలూ ఒకేసారి జరిగాయా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదని చెప్పారు. అలాగే అక్కడ జరిగిన ప్రమాద తీవ్రతను కూడా ఇంకా అంచనా వేయాల్సి ఉందన్నారు.