తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఒక కులాన్ని దూషించడం, కులగణన నివేదికను దహనం చేయడంపై పార్టీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎమ్మెల్సీగా ఉండి పార్టీ రాజ్యాంగాన్ని, విధానాలను ఉల్లంఘించారనే కారణంగా ఈ నోటీసులు జారీ చేసినట్లు కమిటీ పేర్కొంది.
ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ అత్యున్నత స్థాయిలో చర్చించగా, మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయని నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో, క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సమాధానం సమృద్దిగా లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

తీన్మార్ మల్లన్న ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఒక కులంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు, కులగణన నివేదికను దహనం చేయడం పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై ఆ కులానికి చెందిన పెద్దలు, సామాజిక వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ పార్టీ దానికి స్పందించి చర్యలు చేపట్టింది.
ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన నివేదికను ప్రాధాన్యతగా తీసుకుని, సామాజిక న్యాయం కోసం ముందుకెళ్తున్న తరుణంలో, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇలాంటి చర్యలకు పాల్పడడం పార్టీకి నష్టమని భావించిన టీపీసీసీ, ఈ చర్య తీసుకుంది. మల్లన్న వివరణ ఆధారంగా తుదినిర్ణయం తీసుకుంటామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
ఈ నోటీసుల నేపథ్యంలో తీన్మార్ మల్లన్న ఎలాంటి స్పందన ఇస్తారనే విషయం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశముందా? లేక ఆయన వివరణ ఆధారంగా మరింత ఆలోచన చేస్తారా? అన్న ప్రశ్నలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. టీపీసీసీ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.