మళ్లీ పెరిగిన టమాటా ధరలు..

గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా టమాటా సహా అన్ని రకాల కూరగాయలు ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా కూరగాయల సాగు రాష్ట్రంలో తగ్గిపోవడం, డిమాండ్​కు తగిన దిగుబడి లేకపోవడంతో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. ఇక టమాటా ధరలు చూస్తే సామాన్య ప్రజల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. టమాటా అనేది అన్ని వంటల్లో ఎక్కువగా వాడుతుంటాం..దీంతో చాలామంది మార్కెట్లో టమాటా ను కొనుగోలు చేస్తుంటారు. మామూలుగైతే టమాటా ధర తక్కువగానే ఉంటుంది కానీ వర్షాల కారణంగా ఇప్పుడు టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి. గత కొద్దీ రోజులుగా టమాటా ధర కేజీ రూ.100 పలుకుతుండగా..మధ్యలో కాస్త తగ్గింది. దీంతో హమ్మయ్య అనుకున్నారు అంత..కానీ ఇప్పుడు వర్షాలు కారణంగా మళ్లీ టమాటా ధర పెరుగుతూ వస్తుంది.

రెండు రోజుల క్రితం హైదరాబాద్ మార్కెట్లలో కేజీ టమాటా రూ.50-60కి లభించింది. ఇప్పుడు మరోసారి రూ.80(గ్రేడ్-ఏ)కి చేరింది. వర్షాలకు దెబ్బతినడం, సరఫరా సరిపడినంత లేకపోవడంతోనే టమాటా ధరలు పైపైకి చేరుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. మరోవైపు ఉల్లి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కేజీ ఉల్లి రూ.35-40 పలుకుతోంది.