CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖలో కారుణ్య నియామకాలు చేపడతారు. మొత్తం 582 మంది తమ నియామకాల కోసం ఎదురుచూస్తున్నారు. వారందరికీ ఇవాళ సీఎం.. నియామక పత్రాలు ఇస్తారు. రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ మూడు శాఖల్లో పనిచేస్తూ ఎవరైనా ఉద్యోగులు చనిపోతే, వారి కుటుంబంలోని ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తున్నారు. తద్వారా ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది. ఈ కారుణ్య నియామకాలు చాలా కాలంగా జరగట్లేదు. అసలు తమకు ఉద్యోగం ఇస్తారా ఇవ్వరా అని బాధితులు ఎదురుచూస్తూ ఉండాల్సి వచ్చింది. ఐతే.. మంత్రి సీతక్క ఈ విషయాన్ని గమనించారు. ఎలాగూ ఇవ్వాల్సిన ఉద్యోగాలే. మళ్లీ వాటికి లేటు ఎందుకు అనుకున్న ఆమె.. ఫైళ్లను వేగంగా కదిలేలా చొరవ చూపించారు.

582 సూపర్ న్యూమరరీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
పంచాయతీ రాజ్ విభాగంలో 582 సూపర్ న్యూమరరీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు చేసేలా ప్రభుత్వాన్ని సీతక్క ఒప్పించారు. దీంతో ఎప్పుడూ లేని విధముగా 582 సూపర్ న్యూమరరీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయడంతో కారుణ్య నియమాకాలకు మార్గం సుగుమమైంది. 582 కారుణ్య నియామకాలతో పాటు, మిషన్ భగీరథ శాఖలో 55 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 27 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖలో 38 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 55 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లకు నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క అందజేయనున్నారు. కారుణ్య నియామకాలకు అనుమతులిచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కకు సీతక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.