నేడు ఎంపీ పదవులకు రాజీనామా చేయనున్న మోపిదేవి, మస్తాన్‌రావు..!

Today, Mopidevi and Mastan Rao will resign as MPs

అమరావతి: ఏపీలో వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీ నేతలు తమదారితాము చూసుకుంటున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు తమ పదవులకు రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్కర్‌ వారికి అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు బుధవారం రాత్రే న్యూఢిల్లీకి చేరుకున్నారు. త్వరలో వారిద్దరు టీడీపీలో చేరుతున్నట్లు తెలుస్తున్నది. వారిద్దరి దారిలో మరో ఆరుగురు వైసీపీ ఎంపీలు ఉన్నట్లు సమాచారం. కొందరు టీడీపీ, మరికొదరు బీజేపీవైపు చూస్తున్నారు.

కాగా, రాజ్యసభలో ఏపీకి మొత్తం 11 స్థానాలున్నాయి. 2019లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విడతలవారీగా జరిగిన ఎన్నికల్లో అన్నీ స్థానాలను తన ఖాతాలో వేసుకున్నది. దీంతో సంఖ్యాబలం పరంగా ఎగువసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి. ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరిగా ఆ పార్టీని వీడుతున్నారు.

ఇకపోతే..ఎంపీ మోపిదేవి వెంకట రమణ గత కొంతకాలంగా వైసీపీ అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేపల్లె నుంచి ఆయన టికెట్‌ ఆశించారు. తనకు లేదంటే తన కుమారుడికి జగన్‌ అసెంబ్లీ టికెట్‌ ఇస్తాడని భావించారు. కానీ సామాజిక సమీకరణ పేరుతో మోపిదేవి ఫ్యామిలీకి జగన్‌ టికెట్‌ నిరాకరించారు. మోపిదేవికి బదులు గణేశ్‌ను రేపల్లె నుంచి బరిలో దించాడు. అప్పట్నుంచి అసంతృప్తిలో ఉన్న మోపిదేవి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తన రాజకీయ ప్రయోజనాల కోసం అధికారంలో ఉన్న టీడీపీలోకి వెళ్లాలని భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో చర్చలు కూడా జరిపారు. త్వరలోనే ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పచ్చ కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

మోపిదేవి వెంకటరమణకు వైసీపీలో మంచి ప్రాధాన్యతే ఉంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యత్వంతో పాటు బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగానూ ఆయన ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మోపిదేవికి జగన్‌ ప్రాధాన్యత కల్పించారు. 2019 ఎన్నికల తర్వాత మోపిదేవికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. కేబినెట్‌లోకి తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి ఆయన్ను రాజ్యసభకు పంపించారు.