నేడు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం

Today is Balkampet Yellamma Ammavari Kalyanam

హైదరాబాద్‌ః ఈరోజు (మంగళవారం) బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం జరుగనుంది. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరుగుతాయి. సోమవారం ఉదయం గణపతి పూజతో కల్యాణోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం అమ్మవారికి ఎదుర్కోళ్లు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. వేడుకల్లో ప్రధాన ఘట్టమైన ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని, 11.34 నిమిషాలకు ముఖ నక్షత్రయుక్త అభిజిత్‌ లగ్న సుముహూర్తమున వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దేవాలయ ఈవో కె.అంజనీదేవి తెలిపారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు మహాశాంతి చండీ హోమం, సాయంత్రం ఆరు గంటలకు ఎల్లమ్మ అమ్మవారిని రథంపై పురవీధుల్లో ఊరేగిస్తారు.

అమ్మవారి కల్యాణోత్సవానికి తరలివచ్చే భక్తజనులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం తరపున ఏర్పాట్లు జరుగుతున్నా, స్థానికుల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఎమ్మెల్యే తలసాని అన్నారు. రాజకీయంగా చోటు చేసుకున్న మార్పుల ప్రభావం కల్యాణోత్సవంపై పడకుండా స్థానికులు అంతా కలిసి పని చేయాలన్నారు. పలు వ్యక్తిగత కారణాల దృష్ట్యా తాను వేడుకల ఏర్పాట్లపై ఆశించినంత మేర ప్రత్యక్ష పర్యవేక్షణ చేయలేకపోయానని, అయినా భక్తుల సేవలో బల్కంపేట వాసులంతా తమ వంతు భాగస్వామ్యాన్ని అందించేందుకు ముందుకు రావాలన్నారు.

నగరంలోని బల్కంపేట ఎల్లమ్మ తల్లికి గద్వాల నేత పట్టుచీరను నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. రాష్ట్ర రాజధానిలో సోమవారం పట్టుచీరను అందజేసిన ఆలయ కమిటీ చైర్‌పర్సన్‌ గాయత్రీ సతీశ్‌ కుమార్‌ అనంతరం, ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జములమ్మ ఆలయ డైరెక్టర్‌ ఓం ప్రకాశ్‌ కాంబ్లే, రంగస్వామి, తోట రాముడు, రవి పాల్గొన్నారు.

కాగా, భక్తుల ఆరాధ్య దేవతగా వెలుగొందుతున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారు భూమి ఉపరితలానికి 10 అడుగుల దిగువన నిద్రిస్తున్న రూపంలో స్వయంభువుగా వెలసింది. ఈ ఆలయంలో అమ్మవారి మూల విగ్రహం వెనుక భాగం నుంచి నిత్యం నీటి ఊటలు ఉంటాయి. ఎటువంటి కాలంలో అయినా ఈ నీటి ఊటలు సంభవిస్తుంటాయి. చారిత్రక ఆధారాల ప్రకారం, దాదాపు 700 సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ అమ్మవారు వెలసినట్టు చెబుతారు.