తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ (సీఎల్పీ) సమావేశం హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో కొనసాగుతోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యాచరణపై ముఖ్యంగా చర్చ జరిగింది. మొత్తం 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణను చారిత్రాత్మక నిర్ణయాలుగా అభివర్ణించి, వీటి ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు.

ఈ మేరకు తెలంగాణలో రెండు భారీ బహిరంగ సభలను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బీసీ కులగణన సభను ఉత్తర తెలంగాణలో, ఎస్సీ వర్గీకరణ సభను ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సభలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. వీటిని విజయవంతం చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని నేతలకు సూచించారు.
అయితే, ఈ సమావేశానికి ఇటీవల పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉన్నప్పటికీ, వారు చివరి నిమిషంలో డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ అధిష్టానం వారిని సమావేశానికి హాజరయ్యేందుకు ఆహ్వానించినప్పటికీ, వారు గైర్హాజరయ్యారు. ప్రస్తుతానికి ఈ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున, ఈ సమావేశానికి హాజరైతే రాజకీయంగా నష్టపోతామని భావించి, తమ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లకుండా దూరంగా ఉండాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.